వీఆర్ఏలు వెంటనే విధులలో చేరాలి – తెలంగాణ ప్రభుత్వం

గ్రామస్థాయిలో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన పలు హామీలు ఐదేళ్లు గడుస్తున్న అమలుకు నోచుకోవడం లేదు. దీంతో విఆర్ఏలు జిల్లా కలెక్టరేట్ లను ముట్టడించారు. తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. వీఆర్ఏలకు 2007 నుంచి రూ. 10,500 జీతం చెల్లిస్తున్నారని, 15 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

2017 ఫిబ్రవరిలో వీఆర్ఏలను సీఎం కేసీఆర్ హైదరాబాదులోని ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు. పే స్కేల్, జాబ్ చార్జ్ అమలు చేస్తామని, విద్యార్హతలను బట్టి ప్రమోషన్లు కల్పిస్తామని, అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఐదేళ్లు గడుస్తున్న వీరికి మోక్షం కలగలేదు. దీంతో వీఆర్ఏలు ఆందోళన బాట పట్టారు. కాగా వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

వీఆర్ఏల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని, మీ సమస్యలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన సమయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, ఆందోళనలతో సమయం వృధా చేసుకోవద్దని, వెంటనే విధులలో చేరాలని సూచించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.