వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ఈరోజు (మే 9వ తేదీ 2024) ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నట్లు వెల్లడించారు. బుధవారం రోజున మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని.. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరినట్లు చెప్పారు.
గోండ్వానా దండకారణ్య పార్టీ నుంచి సోడే వెంకటేశ్వర్లు, సోషల్ జస్టిస్ పార్టీ నుంచి చెన్నా శ్రీకాంత్, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి గుండాల జ్యోతి, స్వతంత్ర అభ్యర్థులుగా పోతుల ప్రార్థన, తేజావత్ వాసుదేవ, యాతాకుల శేఖర్, దునుకుల వేలాద్రి, గుగులోతు సంతోష్, రత్నం ప్రవీణ్, జున్ను భరత్, గుగులోతు రాజునాయక్, పట్నం మల్లికార్జున్ తదితరులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్లు అందజేశారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.