తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1, 2 లతో పాటు డీఎస్సీ పరీక్షను వాయిదా వేసి డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో మండిపడ్డ నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాలో అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 11,062 డీఎస్సీ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుందని.. ఈ పరీక్షల అనంతరం మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
దాదాపు 2లక్షల 79వేల మంది నిరుద్యోగులు డీఎస్సీ అప్లై చేసుకున్నారు. ఇప్పటికే 2లక్షల 500 మంది డీఎస్సీ అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నాారు. అధిక శాతం విద్యార్థులు డీఎస్సీ పరీక్ష జరగాలనుకుంటున్నారు. మరో 6000 వరకు ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని నెలల తరువాత మళ్ళీ ఇంకో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. ఈ నెల 18 నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ధర్నా చేస్తున్న క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.