బోనాల తరహాలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాజాగా ఇవాళ గణేష్ ఉత్సవ సమితీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రధానంగా నగరంలో లక్షల సంఖ్యలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు.
యువత చాలా ఉత్సాహంగా నిర్వహించే ఈ వినాయక చవితి గురించి మంత్రి చర్చించారు. జీహెచ్ఎంసీ, ఆర్అండ్ బీ, రెవెన్యూ, వాటర్ వర్క్స్ అధికారులు హాజరయ్యారు. విగ్రహాల ప్రతిష్టాపన ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సెప్టెంబర్ 07న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏ విధంగా ఉత్సవాలను జరపాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఖైరతాబాద్ గణేషుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.