రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులకు త్వరలోనే కమిషన్ పెంచుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధన్ బాబు తెలిపారు. సోమవారం ఆర్టీసీ కళాభవన్ లో తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ 14వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా చేర్చనున్న కొన్ని అదనపు సర్వీసులను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అవినీతిని పారదోళడానికి 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం మీ సేవ ప్రాజెక్టును తీసుకొచ్చిందని తెలిపారు.
నాటి నుంచి నేటి వరకు అవినీతి లేకుండా పౌరులకు సేవలు అందించడంలో మీసేవ ఒక ప్లాట్ ఫారంగా నిలిచిందన్నారు. మీసేవల ద్వారా 500కి పైగా సర్వీసులను పౌరులకు అందిస్తున్నారని పేర్కొన్నారు. మీసేవ నాణ్యమైన సేవలను అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 మీసేవ కేంద్రాలున్నాయని, వీటితో పాటు ఫ్రాంచైజెస్ కేంద్రాలు దాదాపు 5000 పైచిలుకు ఉన్నాయన్నారు. మీసేవ కేంద్రాల నిర్వహణకు ఆరోగ్యపరమైన భద్రతను కూడా కల్పించడం జరుగుతుందని.. దీనికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.