ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో బోనాల వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం (జులై 28వ తేదీ) రోజున పెద్ద ఎత్తున భాగ్యనగరంలో లాల్దర్వాజ సింహవాహిని మహంకాళీ అమ్మవారి బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లూ చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైన్స్ షాపులు మూసేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్లో ఇవాళ స్టార్ హోటళ్లు, నాన్ ప్రొప్రయిటరీ క్లబ్‌లు, రెస్టారెంట్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు బార్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. ఇవాళ (జులై 28వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. సౌత్ ఈస్ట్ జోన్‌లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం 24 గంటల వరకే వైన్స్ షాపులు బంద్ కానున్నట్లు చెప్పారు. చాటుగా మద్యం విక్రయాలు చేసినా.. కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.