తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలకు వేళయింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల పోలీస్ బలగాలను మోహరించి… కొత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. మరోవైపు కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నిషేధాజ్ఞలు విధించారు.
శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లకు నిబంధన వర్తిసుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు కిలోమీటరు దూరంగా జెండాలు, కర్రలు, పేలుడు పదార్థాలు, గుమికూడటం, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు.