వింగ్స్ ఇండియా ప్రదర్శనకు భాగ్యనగరం ముస్తాబైంది. ఇవాళ ఉదయం 9.30గంటలకు ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 130 ఎగ్జిబిట్‌లను ప్రదర్శించనున్నారు. దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ఇందులో ఎగ్జిబిట్ చేయనున్నారు. 106 దేశాలకు చెందిన 1500మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. దాదాపు 5వేల మంది వ్యాపారవేత్తలు వింగ్స్ ఇండియాను సందర్శించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
విమానాల తయారీదారులు సాంకేతిక నిపుణులు, విమానాల ఆపరేటర్లు, విమానయాన శాఖ అధికారులు, కన్సల్టెంట్లు, ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఫైనాన్స్ సంస్థలు, పైలట్లు వింగ్స్ ఇండియా ప్రదర్శనలో భాగస్వాములు కానున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయంలోనే గతంలో రెండుసార్లు ఈ ప్రదర్శనను నిర్వహించిన విషయం తెలిసిందే. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన హెలికాప్టర్లు, ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777X విమానం, ఎయిర్ ఇండియాకు చెందిన ఏ350 విమానాలు ఈ ప్రదర్శనలో సందడి చేయనున్నాయి.