బంజారాహిల్స్ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. ట్రాఫిక్‌ ఎస్‌ఐపై మహిళల దాడి

-

హైదరాబాద్లో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాఫిక్ అధికారులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు మందుబాబులు పోలీసులతో గొడవకు దిగుతున్నారు. మద్యం సేవిస్తున్న వారిలో మహిళలు కూడా ఉంటున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, హోంగార్డుపై మహిళలు దాడికి తెగబడ్డారు. ఏం జరిగిందంటే..?

బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్‌ నంబరు 2లోని పార్క్‌హయత్‌ ముందు ఆదివారం రాత్రి ట్రాఫిక్‌ ఎస్‌ఐ అవినాశ్‌బాబు, హోంగార్డు నరేష్తో పాటు ఇతర సిబ్బంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా.. అర్ధరాత్రి దాటిన తరువాత 1.15 గంటల ప్రాంతంలో ఓ కారు రాగా.. వాహనం నడుపుతున్న మహిళకు నరేష్‌ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ మహిళ నరేశ్ను బూతులు తిట్టి అతడి మొబైల్ లాక్కొని నేలకేసి కొట్టింది. ఆపడానికి వచ్చిన ఎస్ఐ అవినాశ్ బాబు వద్ద ఉన్న బాడీ కామ్ను కూడా ధ్వంసం చేసి దురుసుగా ప్రవర్తించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన యువకులు నరేశ్ను తిట్టి నెట్టేశారు. ఈ క్రమంలో మహిళలు పరారవ్వగా ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్‌ ఫిర్యాదుమేరకు పోలీసులు వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news