ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని మాజీ మంత్రి రోజా పొగడబోయి విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా గత ప్రభుత్వం మహిళలకు ఏం చేసిందో గుర్తు చేశారు. అయితే చంద్రబాబు పథకాలను విమర్శించబోయి జగన్పై విమర్శలు చేశారు. మహిళ అంటే చంద్రబాబుకు గౌరవం, అభిమానం లేదన్నారు. మహిళకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు, పవన్, అనితకు లేదని విమర్శించారు.
జగన్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి గుర్తు రానన్ని పథకాలు మహిళలకు అమలు చేశామని చెప్పారు. చేయూత, అమ్మఒడి, ఆసరా, ఇళ్లు, రైతు భరోసా, సున్నా వడ్డీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అమలు చేశామని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న పగ, చంద్రన్న దగా, చంద్రన్న నిత్యావసరాల ధరల భగభగ అంటూ అలాగే ‘జగన్న మోసం’ అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే సారీ అంటూ చంద్రన్న మోసం, చందన్న తల్లికి పంగనామం, చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు అంటూ విమర్శలు చేశారు.