తెలంగాణకు మాటలు..గుజరాత్ కు మూటలు: మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్ల తో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో కార్పొరేటర్ల ను మోడీ ఆత్మీయంగా పలకరించారని, సమస్యలపై ఆరా తీశారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ భేటీని ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణకు, హైదరాబాద్ కు ఇప్పటిదాకా ఏం చేశారంటూ ఆ ట్వీట్ లో మోదీని కేటీఆర్ నిలదీశారు.

 

” హైదరాబాద్ వరద నివారణ నిధుల విషయంలో ఏమైనా పురోగతి ఉందా? మూసి ఆధునీకరణ పనులకు సంబంధించి ఏమైనా నిధులు ఇస్తారా? హైదరాబాద్ మెట్రోకు ఏమైనా ఆర్థిక దన్ను ఇస్తున్నారా? ఐటీఐఆర్ పై ఏమైనా కొత్త మాట చెబుతారా?”.. ఇలా వరుస ప్రశ్నలు సంధించిన కేటీఆర్.. తెలంగాణకు పైసా నిధులు ఇవ్వని మోదీ కార్పొరేటర్ ల తో మాత్రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మాటలు మాత్రమే చెబుతూ.. మూటలన్నీ గుజరాత్ కు ఇస్తున్నారు అంటూ మోడీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.