– స్వామి వివేకనందుని రచనలతో స్ఫూర్తి పొందండి
– తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్ః యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. స్వామి వివేకనంద జయంతిని పురస్కరించుకుని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) అధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 21వ జాతీయ యువత దినోత్సవం(యువోత్సవ్) సదస్సుల్లో ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, స్వామి వివేకనంద ఒక నిరంతర స్ఫూర్తి అనీ, యువత కూడా ఆయన పుస్తకాలు చవిది స్ఫూర్తిని పొందాలని సూచించారు. తాను చిన్నప్పటి నుంచి వివేకనంద బోధనలు స్ఫూర్తిగా తీసుకుని గవర్నర్ స్థయికి ఎదిగానని తెలిపారు.
తాను పాఠశాలలో చదువున్నప్పుడు స్వామి వివేకనంద పుస్తకాన్ని తనకు బహుకరించారనీ, అప్పటి నుంచి నేటి వరకూ ఆయన బోధనలు చదువుతూ నిరంతరం స్ఫూర్తిని పొందుతున్నానని తమిళిసై తెలిపారు. ప్రస్తుత సమాజంలో చిన్న చిన్న కారణాలకే పలువురు యువకులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారనీ, అలా చేయోద్దని సూచించారు. వివేకనందుని బోధనలు చదివితే తప్పకుండా అలాంటి వారిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావని అన్నారు.
యువత తమలో ఉన్న శక్తిని గ్రహించాలనీ, ప్రతిఒక్కరు వారికి వారే నిజమైన హీరోలని పేర్కొన్నారు. నేడు దేశంలో యువతే అధికంగా ఉందనీ, భవిష్యత్తు అంతా వారిదేనని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, మౌలానా అజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్శిటీ ఇన్‌చార్జీ విసి రహమతుల్లా, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కంపెనీ సెక్రటరీస్ ఇండియా అధ్యక్షుడు ఆశీష్ గార్గ్ కూడా పాల్గొన్నారు.