మీరు ఎప్పుడైనా సిమ్లా వెళ్లాలా? పోనీ కులుమనాలీ, ఊటీ, కొడైకెనాల్ ఎప్పుడైనా వెళ్లారా? లేదండి.. ఎక్కడికీ వెళ్లలేదు అంటారా? ఎప్పటి నుంచో వెళ్దామనుకుంటున్నాం కానీ.. కుదరడం లేదంటారా? అవసరమే లేదండి. మీరు అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం హైదరాబాదే సిమ్లాలా మారిపోయింది. కులుమనాలీ, ఊటీ, కొడైకెనాల్ ను తలపిస్తోంది. ఇక్కడే మీకు అన్ని పర్యాటక ప్రదేశాలు కనిపిస్తున్నాయి. అవును.. గత వారం రోజులుగా హైదరాబాద్ ను చలి వణికిస్తోంది. గత ఏడు ఎనిమిదేళ్ల నుంచి ఇంత చలిని ఎప్పుడూ చూడలేదని నగరవాసులు స్పష్టం చేస్తున్నారు.
గంటలకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. కోస్తాంధ్రాలో పెథాయ్ ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవడంతో పాటు ఇలా చలి గాలులు వీచి ఉష్ణోగ్రతను ఒక్కసారిగా పడిపోయాయి.
హైదరాబాద్ లో సాధారణంగా ఈ టైమ్ లో ఉష్ణోగ్రతలు 28 వరకు ఉంటాయి. కానీ.. నిన్న మంగళవారం ఎంత నమోదైందో తెలుసా? 19.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.