వినాయకచవితి రాబోతుంది. ఇక పల్లె నుంచి పట్టణం వరకూ పండగ జోరు షూరూ కానుంది. చలవపందిళ్లు, డీజే సాంగులతో సందడే సందడి. వినాయకుడు అంటే మనకు ముందు గుర్తొచ్చేది.. తొండం కదా..! కొన్ని వినాయకుల విగ్రహాలకు తొండం కుడివైపు ఉంటే, కొన్నింటికి ఎడమవైపు ఉంటుంది. కానీ అసలు తొండమే లేని వినాయకుడుని మీరు చూశారా..? తొండం లేకుండా అసలు గణేషుడు ఎలా ఉంటారండీ అంటారా..? జైపూర్‌లో ఓ ఆలయంలో ఆ విజ్ఞేశ్వరుడికి తొండం ఉండదట.
జైపూర్‌లో అనేక గణేష్ ఆలయాలు ఉన్నప్పటికీ, దేశంలో మొట్టమొదటి తొండం లేని లేని గణేశ దేవాలయం ఆరావళి పర్వతం మీద ఉంది. గణేష్ చతుర్థి నాడు ఇక్కడి గణేష్ ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఆ రోజు దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయం గర్ గణేష్ పేరుతో ప్రసిద్ధి చెందింది.
18వ శతాబ్దంలో జైపూర్ స్థాపన కోసం, సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడికి పిలిపించి అశ్వమేధ యాగం నిర్వహించి, గర్ గణేష్ ఆలయాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో శ్రీ గణేశుడి కళ్ళు చెక్కుచెదరకుండా ఉండటానికి, అతని ఆశీర్వాదం మొత్తం జైపూర్‌పై ఉండేలా గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉండే విధంగా ప్రతిష్టించారు.
500 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి చేరుకోవాలంటే 365 మెట్లు ఎక్కాలి. గణేశుడి దర్శనం కోసం ప్రతిరోజూ భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ఆలయంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిషేధం. కేవలం భగవంతుని దర్శనం మాత్రమే చేసుకోవచ్చు. అందుకే 300 ఏళ్లుగా గణేశుడి ఫోటోను బయటపెట్టలేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆలయంలో రాజు సిటీ ప్యాలెస్ నుండి నిలబడి హారతి దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. కొండపై ఉన్న గర్ గణేష్, గోవింద్ దేవ్ టెంపుల్, సిటీ ప్యాలెస్, ఆల్బర్ట్ హాల్ ఒకదానికొకటి సమాంతరంగా ఒకే దిశలో ఉంటాయి. ఇది దూరం నుండి చూడవచ్చు.
ఇక్కడి భక్తులు గణేశుడికి తమ కోరికలను లేఖలల్లో రాసి ఆయన పాదాల దగ్గర ఉంచుతారు. దానిని నెరవేర్చమని కోరడంతో పాటు వరుసగా ఏడు బుధవారాలు గర్ గణేశుడిని దర్శించుకోవడం ద్వారా కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో మెట్లు ఎక్కిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద రెండు ఎలుకలను అమర్చారు. భక్తులు ఎవరి చెవుల్లోకి తమ కోరికలు చెప్పుకుంటారు. ఎలుకలు ఆ కోరికలను బాల గణేశుడికి తెలియజేస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.