కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5.0 అమలవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జూన్ 8వ తేదీ నుంచి పలు ఆంక్షలకు సడలింపులు ఇవ్వనున్నారు. ఇప్పటికే జూన్ 11వ తేదీ నుంచి తిరుమల ఆలయాన్ని తెరుస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కాగా జూన్ 8వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లోనూ భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ఆలయాల్లో తరచూ శానిటైజేషన్ చేయాలని మంత్రి అన్నారు. ఈ మేరకు ఆలయాలు సూచనలు చేసినట్లు తెలిపారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి దర్శనం చేసుకోవాలన్నారు. కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్న ఆలయాల్లో భక్తులకు అనుమతి ఉండదని తెలిపారు. అలాగే ఆయా జోన్లలో ఉండేవారు ఆలయాలకు వెళ్లకూడదన్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో యాదాద్రి నరసింహ స్వామి, భద్రాద్రి సీతారామాలయం సహా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలు సోమవారం నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నాయి. ఇక దర్శనం, అభిషేకం తదితర టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.