ప్రకాశం జిల్లా చీరాలలో మత్స్యకారుల మధ్య వివాదం రాజకీయ రంగు పులుముకుంది. మత్స్యకారులు కరణం, ఆమంచి వర్గీయులుగా విడిపోయారు. మత్స్యకారుల మధ్య సమస్యని పరిష్కరించేందుకు వచ్చిన ఎంపి మోపిదేవి వెంకటరమణ సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. ఉద్రిక్తంగా మారిన చీరాల సముద్ర తీర ప్రాంతం రాజకీయ రచ్చకు తెరలేపింది.
వాడరేవులో ఆమంచి వర్గీయులపై దాడి జరిగితే, ఇటు కఠారివారిపాలెంలో కరణం బలరామ్ వర్గీయులపై దాడి జరిగింది. రెండు వర్గాలు దాడులకు తెగబడ్డారు. మత్స్యకారుల దాడులు చివరికి అధికార పార్టీలో గ్రూపు తగాదాలకు కారణమై, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. అధికార పార్టీ నేతల మధ్య విభేదాలతో మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సముద్రంలో చేపల వేటకి వాడే బల్లవల విషయంలో రెండు మత్స్యకార గ్రామాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. దీంతో చీరాల అధికార పార్టీలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి.
ఎంపీ మోపిదేవి గాయపడిన మత్స్యకారులను పరామర్శించడంతో పాటూ రెండు గ్రామాల మత్స్యకారులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే, ఎంపి మోపిదేవి చీరాల రావడంతో ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమ అనుచరులతో మోహరించారు.అటు కఠారివారిపాలెంలో మత్స్యకారులతో మాట్లాడి మోపిదేవి వెళ్తున్న సమయంలో కరణం బలరామ్ వర్గీయుడిపై ఆమంచి వర్గీయులు దాడి చేశారు. కఠారివారిపాలెంలో రెండు వర్గాలు కొట్లాటకి దిగాయి. మత్స్యకారులు కరణం, ఆమంచి వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు.
మత్స్యకారుల సమస్య కాస్తా..కరణం, ఆమంచి వర్గీయుల సమస్యగా మారింది. ఇప్పటికే ఉప్పునిప్పుగా ఉన్న కరణం, ఆమంచి మధ్య వాడరేవు, కఠారివారిపాలెం మత్స్యకారుల వివాదం వచ్చి చేరింది. దీంతో చీరాల సముద్ర తీర ప్రాంతంలో ఎప్పుడు ఎవరిపై దాడులు జరుగుతాయోనన్న టెన్షన్ నెలకొంది. నిజానికి ఇరు గ్రామాల మద్య గత మూడేళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణలు జరుగుతున్నాయి. పడవలను, వలలను ఎత్తుకెళ్లిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సముద్ర జలాల్లో సినీ తరహాలో ఛేజింగులు కూడా జరిగాయి.
ఈ నెల రెండవ తేదీన అధికారులు ఒంగోలులో ఇరుగ్రామాల మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఆ సమావేశంలో కూడా మత్స్యకారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సముద్ర తీరంలో ఇరు గ్రామాల మత్స్యకారుల మధ్య అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత జరిగిన పరస్పర దాడులు, నిరసనలు చివరికి అధికార పార్టీలో గ్రూపు తగాదాలకు కారణమై, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.