సీఎం ఏరికోరి తెచ్చుకున్నవారికి వేధింపులేనా ?

-

సీఎం ఏరికోరి తెచ్చుకున్న అధికారి ఇబ్బంది పడుతున్నారా..అధికారులు పూర్తికాలం పోస్టులో కుదురుకోలేక పోతున్నారా..తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ పోస్టు పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఒకప్పుడు అత్యంత కీలకంగా ఉన్న పౌరసరఫరాల శాఖ ఇప్పుడు ఎవరికీ పట్టనిదిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సివిల్ సప్లయ్‌ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి.. ఐపీఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించారు. సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అవినీతి తగ్గింది. తోక జాడించే రైస్ మిల్లర్లు, డీలర్ల ఆట కట్టించారు. దొంగ రేషన్‌కార్డులను అరికట్టి.. బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకున్నారు.

సివిల్ సప్లయ్‌శాఖకు రెండో కమిషనర్‌గా వచ్చిన ఐపీఎస్ అధికారి అకున్‌ సబర్వాల్‌ సైతం దూకుడుగానే వెళ్లారు. దీంతో ఆయన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసే వరకు నిద్రపోలేదు ప్రజాప్రతినిధులు. అకున్‌ తర్వాత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణరెడ్డి కమిషనర్‌గా వచ్చారు. ఆయన్ని సీఎం కేసీఆర్‌ ఏరికోరి నియమించారు. ఆయన వచ్చిన కొన్నాళ్లకే లాక్‌డౌన్‌ మొదలైంది. పేదలకు 1500 నగదు అందజేసే విషయంలో కొందరు కోర్టుకెళ్లడంతో మొట్టికాయలు పడ్డాయి. అయితే తన ప్రమేయం లేకుండా తీసుకున్న నిర్ణయాలకు తానెలా బాధ్యత వహిస్తానని సత్యనారాయణరెడ్డి సీఎస్ సోమేష్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగడం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. సత్యనారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.

ప్రస్తుతం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందట. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు.. నగదు జమ.. పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీలో ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువగా ఉన్నట్టు అనిల్‌ వాపోతున్నారట. ప్రతి విషయంలో సీఎస్ జోక్యం మితిమీరుతోందని.. సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందని చెబుతున్నారట. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కు చెప్పి.. ఎక్కువ రోజులు కమిషనర్‌గా ఉండలేనని స్పష్టం చేశారట. ఈ నెలాఖరు వరకే పదవిలో కొనసాగుతానని చెప్పారట.

సివిల్‌ సప్లయ్‌తోపాటు దేవాదాయ శాఖ కమిషనర్‌గా రెండేళ్లపాటు ఉండేలా అనిల్‌కుమార్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే స్వేచ్ఛ లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్లు.. సీఎస్‌ జోక్యంతో మధ్యలోనే వెళ్లిపోవాలని చూస్తున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అయ్యో అనీల్‌ కూడా వెళ్లిపోతున్నారా అని అధికార వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. సీఎం కేసీఆర్‌ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. మరి.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటారో.. లేక కొత్త కమిషనర్‌ వస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news