ఆ వ్యక్తి చదివింది కేవలం నాలుగో తరగతి మాత్రమే. కానీ ఏకంగా నాలుగు భాషల్లో నిఘంటువు రూపొందించాడు. సామాన్యంగా ఎవరైనా నిఘంటువులో ఓ పదాన్ని వెతుక్కోవడానికి తడబడుతుంటారు. కానీ కేరళకు చెందిన శ్రీధరన్ (83 ఏళ్లు) పట్టుదల, కృషితో నాలుగు నిఘంటువును రూపొందించాడు. పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తూనే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి దాదాపు 12.5 లక్షల పదాలకు అర్థాలను కనుగొన్నారు. వాటిని ఆయా భాషల్లో నిఘంటువును తయారు చేసి సంక్షిప్తం చేశారు.
బాల్యం..
శ్రీధరన్.. కేరళలోని తలస్సెరీ గ్రామంలో జన్మించారు. నాలుగో తరగతి వరకే చదువుకుని ప్రాథమిక విద్యను స్వస్తి పలికాడు. ఆ తర్వాత ఓ బీడీ కర్మాగారంలో చేరి పనిచేసేవాడు. అయితే పదాల అర్థాలను తెలుసుకోవడానికి తాపత్రయ పడేవాడు. ఆ తాపత్రయమే 4 నిఘంటువును రూపొందించేందుకు దోహదపడింది. బీడీ కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడే ఇంగ్లీష్ స్టాండర్డ్ పబ్లిక్ పరీక్ష (ఈఎస్ఎల్ సీ)ను పూర్తి చేశాడు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సంపాదించాడు.
పదాల అర్థాల వేటలో..
శ్రీధరన్ ఓ వైపు ఉద్యోగం చేస్తూనే వివిధ భాషల్లో పదాల అర్థాలను వెతకడం మొదలు పెట్టారు. 1872లోనే మలయాళంలో తొలి నిఘంటువు విడుదలైంది. ఆ తర్వాత 1984లో ఓ నిఘంటువును రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. 1994 వరకు నిఘంటువు పనులు కొనసాగాయి. అప్పుడే ఉద్యోగ విరమణ చేసి.. పూర్తి సమయాన్ని నిఘంటువు రూపొందించేందుకు కేటాయించేవాడు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో పదాలను వెతకడం ఎంతో ఆసక్తి కలిగించేదని ఆయన చెప్పుకొచ్చారు.
నిఘంటువు కావాలనుకుంటే..
నిఘంటువు తయారీకి ప్రైవేట్ పబ్లిషర్స్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవాడు. చివరికి ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ నందన్ ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ఓ వీడియోను రూపొందించాడు. ఈ వీడియోలో శ్రీధరన్ పడుతున్న కష్టాల గురించి వివరించాడు. సమస్యలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత 2020 నవంబర్ లో నిఘంటువు మార్కెట్ లో రిలీజ్ అయింది. మొత్తం 900 పేజీలున్న నిఘంటువు ప్రచురణ బాధ్యతలు కేరళ సీనియర్ సిటిజన్ ఫోరం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్ లో నిఘంటువు ధర రూ.1500 గా ఉందని.. ఆసక్తి కలిగిన వారు ఫోన్: 9895410120 నంబర్ కు సంప్రదించి ఆర్డర్ చేసుకోవచ్చన్నారు.