జమ్ముకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి వారం రోజులు గడువక ముందే ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సాధారణ పౌరులు మరణించారు. ఈ ఘటనపై అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. కాగా, ఈ దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఆదివారం గాందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడి వెనుక ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్’(TRF)హస్తం ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
టీఆర్‌ఎఫ్ చీఫ్ షేక్ సజ్జద్ గుల్ ఈ దాడికి అసలు సూత్రధారి అని తెలుస్తోంది. ఇదిలాఉండగా, జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు, సిబ్బందిపై నిన్న సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు.