డిసెంబర్​ 21 నుంచి ఎస్&​పీ 500లో టెస్లా…!

-

విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా మరో ఘనత దక్కించుకోనుంది. అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా డిసెంబర్ 21న ఎస్​&పీ 500 ఇండెక్స్​లో చేరనుంది. సోమవారం నాటి మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్​) ఆధారంగా.. ఈ బెంచ్​మార్క్​లో చేరిన తర్వాత టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలవనుంది.

మార్కెట్లు ముగిశాక ఈ వార్త వెల్లడికావడంతో టెస్లా ఇంక్‌ షేరు ఫ్యూచర్స్‌లో ఏకంగా 14 శాతంపైగా దూసుకెళ్లింది. 408 డాలర్ల నుంచి 462 డాలర్లకు ఎగసింది. దీంతో కంపెనీలో 20 శాతం వాటా కలిగిన సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపద 117.5 బిలియన్‌ డాలర్లను తాకింది. ఫలితంగా వ్యక్తిగత సంపద విషయంలో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ఎలన్‌ అధిగమించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది. ఫలితంగా సాంకేతికంగా ప్రపంచ కుబేరుల్లో మూడో ర్యాంకుకు చేరినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది(2020) టెస్లా ఇంక్‌ షేరు 450 శాతం ర్యాలీ చేయడంతో ఇప్పటికే మస్క్‌ సంపదకు 90 బిలియన్‌ డాలర్లు జమ అయ్యింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) 387 బిలియన్‌ డాలర్లను తాకింది.

సోమవారం కోవిడ్‌-19 లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నట్లు ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. మస్క్‌ ఏర్పాటు చేసిన రాకెట్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌.. నలుగురు అంతరిక్ష యాత్రికుల(ఆస్ట్రోనాట్స్‌)ను స్పేస్‌ స్టేషన్‌లోకి పంపినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క ఇండెక్సులో టెస్లా ఇంక్‌కు చోటు కల్పిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ-500 తాజాగా వెల్లడించింది. దీంతో మస్క్‌ వ్యక్తిగత సంపద భారీగా బలపడటం విశేషం. ఇప్పుడు భారీ మార్కెట్‌ విలువ కలిగిన టెస్లా ఇంక్‌ ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్సులో చేరడం ద్వారా యూఎస్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ పెట్టుబడి ప్రణాళికల్లో సవరణలు చోటుచేసుకోనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్‌అండ్‌పీ ఇండెక్సులో చేరడం ద్వారా టెస్లా ఇంక్‌ అధికారికంగా బ్లూచిప్‌గా మారనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news