దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో ఓ నటుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నాగభూషణ అనే నటుడు శనివారం రాత్రి తన కారుతో ఓ జంటను ఢీకొట్టాడు.

అతడు ఉత్తరహళ్లి నుంచి కొననకుంటేకు కారులో వెళుతున్న సమయంలో.. వసంతపుర మెయిన్ రోడ్డు వద్ద పుట్ ఫాత్ పై వెళ్తున్న ప్రేమ, కృష్ణ దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రేమ (48) మృతి చెందింది. కృష్ణ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తగరు పాళ్య, ఇక్కత్, కౌసల్యా సుప్రజా రామా వంటి చిత్రాల్లో నాగభూషణ నటించాడు.