ఏడాదిలో మూసి ప్రక్షాళన చేయాల్సిందే: తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశాలు…!

-

మూసీ నది ప్రక్షాళన పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ విలాస్ అప్జల్‌పుర్కర్ నేతృత్వంలో కమిటీ వేసింది ఎన్జీటీ. మానిటరింగ్ కమిటీలో సభ్యులుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉంటారు. నెల రోజుల్లో మానిటరింగ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.

నాలుగు నెలల్లో తొలి నివేదిక అందజేయాలని కమిటీకి ఆదేశం ఇచ్చింది. ఏడాదిలో మూసీ నది ప్రక్షాళను పూర్తి చేయాలని ఎన్జీటీ సూచించింది. ఇప్పటివరకు మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఎన్జీటీ. నది ప్రక్షాళనకు అంచనా వ్యయం కూడా అధికంగా వేసినట్లు గుర్తించామని ఎన్జీటీ పేర్కొంది.

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధికారుల ఇచ్చిన సమాచారంతో పోలిస్తే సాధారణ ధర కంటే 20 రెట్లు అధికంగా అంచనా వేశారని ఎన్జీటీ పేర్కొంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మూసీ నది ప్రక్షాళనకు పర్యవేక్షణ కమిటీ వేస్తున్నట్లు తెలిపింది ఎన్జీటీ. మూసీ నది ప్రక్షాళనపై మహ్మద్ నహీం పాషా వేసిన పిటిషన్ పై లిఖితపూర్వక ఆదేశాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది ఎన్జీటీ.

Read more RELATED
Recommended to you

Latest news