దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను, ఉద్యమ స్ఫూర్తిని కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఫోరం ఫర్ తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ముక్తకంఠంతో ఖండించారు. నేడు హైదరాబాద్ లకిడికపూల్ అశోక హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బేషరతుగా తెలంగాణ సమాజానికి ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని వ్యాఖ్యలు కొత్త రాష్ట్రంపై కొత్త కుట్రలకు జరిగే ప్రమాదం ఉందని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఏర్పాటును పరిరక్షించుకుంటూ, ఇటువంటి విచ్చిన్నకర వ్యాఖ్యలను, చర్యలను నిరసిస్తూ మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఫోరం నిర్ణయించింది. రౌండ్ టేబుల్ సమావేశానికి నాటి జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, జానపద పరిరక్షకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, న్యూడెమోక్రసీ కార్యదర్శి గోవర్ధన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టిఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాగ ఫోరం ఫర్ తెలంగాణ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి జి. బుచ్చన్న అధ్యక్షత వహించగా తెలుపు టీవీ ఎడిటర్-ఫోరం బాధ్యులు కందుకూరి రమేష్ బాబు వందన సమర్పణ చేశారు.