నేడు పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన ద్వారా స్పందించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున అంజలి ఘటిస్తున్నానని తెలిపారు. పోలీసుల త్యాగాలు మరువలేనివని అన్నారు పవన్ కళ్యాణ్.
“పాలకుల ఒత్తిళ్లు లేకుంటే పోలీసులు నిబద్ధతతో సేవ చేస్తారు. పోలీసు శాఖలో పని చేసే ప్రతి ఉద్యోగి…. హోమ్ గార్డు నుంచి ఉన్నతాధికారి వరకూ అందరి జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవే. విధి నిర్వహణలో అమరులైనవారి త్యాగాలను ఎవరూ మరువకూడదు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు నా తరఫున, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నాను.
ఒంటి మీద యూనిఫామ్ ఉన్న ప్రతి పోలీసు ఉద్యోగి తన కర్తవ్య నిర్వహణ కోసం… నియమ నిబంధనలు పాటించేందుకు సంసిద్ధులవుతారు. అయితే పాలక పక్షం తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను పావులుగా వాడుకోవడం మొదలుపెట్టిన క్షణం నుంచే ఆ శాఖకు సంకెళ్లుపడటం మొదలవుతోంది. ఉన్నత చదువులు అభ్యసించి సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపికైన అధికారులు సైతం చేష్టలుడిగి ఒత్తిడితో పని చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థితి నుంచి పోలీస్ వ్యవస్థను కాపాడుకొన్నప్పుడే ప్రజలకు శాంతిభద్రతలు లభిస్తాయి. పాలకుల ఒత్తిళ్లు లేకుంటే పోలీసులు నిబద్ధతతో సేవ చేయగలరు.
పోలీసు శాఖలో పని చేసే సిబ్బందికి టి.ఎ., డి.ఎ., సరెండర్స్ ఇవ్వరు… వారు దాచుకొన్న మొత్తాన్ని కూడా అవసరానికి ఇవ్వరు. రాత్రనక పగలనక పని చేసే సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదు. వారానికి ఒక రోజు సెలవు ఇస్తామని అమలు కానీ జీఓలు ఇచ్చి… ఆ సెలవు నా మనసులో మాట అంటూ తియ్యటి కబుర్లు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. పాలకులు ఎలాగూ ఆ శాఖను ఒక పావుగా వాడుకొంటున్నారు. ప్రజలు పోలీసుల పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకోవాలి. పోలీసులు సైతం నియమ నిబంధనలను అనుసరిస్తూ, చట్టాన్ని అమలు చేస్తూ విలువలను పునరుద్ధరిస్తే ప్రజల నుంచి కచ్చితంగా మద్దతు పొందుతారు”. అన్నారు జనసేనాని.