కరోనా ప్రభావం మొదలైన తొలినాళ్లలో జనాలు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. వామ్మో చికెనా.. అని అన్నారు. తరువాత.. అబ్బే, చికెన్ తినడం వల్ల కరోనా రాదని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మాంసకృత్తులు ఉన్న ఆహారాలను తీసుకోవాలని చెప్పడంతో జనాలు చికెన్‌ను విపరీతంగా తినడం మొదలు పెట్టారు. అంతకు ముందు వారంలో ఒక్కసారి తినే వారు కాస్తా వారంలో 3,4 సార్లు తినడం మొదలు పెట్టారు. దీంతో చికెన్ ధరలు సాధారణ స్థితికి చేరుకుని కొద్దిగా పెరిగాయి.
అయితే ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో మరోసారి జనాలకు భయం పట్టుకుంది. ఇక ఇది పక్షులకు సంబంధించినదే కనుక, ఈసారి ఎంత చెప్పినా జనాలు చికెన్‌ను తినడం లేదు. పక్షులకు బర్డ్ ఫ్లూ వస్తుంది కనుక వాటిని తినకూడదని చెప్పి జనాలు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో సహజంగానే చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో 1 కేజీ చికెన్ ధర రూ.250 వరకు పలికింది. కానీ ఇప్పుడది రూ.160 నుంచి రూ.180 మధ్య పలుకుతోంది. ఇక ఈ ధర కూడా ఇంకా తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమలకు అప్పుడు కరోనా కష్టాలు రాగా ఇప్పుడు బర్డ్ ఫ్లూ సమస్యలు వచ్చాయి.
బర్డ్ ఫ్లూ భయం తెలుగు రాష్ట్రాల్లో లేదు. అయినప్పటికీ జనాలు మాత్రం చికెన్ తినేందుకు ఆసక్తిని చూపించడం లేదు. ఎందుకొచ్చిన తంటాలే అని వెనుకంజ వేస్తున్నారు. దీంతో ధరలు తగ్గాయి. అయితే తెలంగాణలో చికెన్, పౌల్ట్రీ పరిశ్రమల్లో కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది కనుక ఇప్పుడు ఆ పరిశ్రమలకు మరోసారి నష్టాలు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. బర్డ్ ఫ్లూ భయం పోతే గానీ మళ్లీ సాధారణ పరిస్థితులు రావని అంటున్నారు. అప్పటి వరకు పౌల్ట్రీ పరిశ్రమలు నష్టాలను భరించక తప్పదు.