తిరుపతి ఉపఎన్నికలో గ్లామర్‌ షో దే పై చేయా

-

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సినీ గ్లామర్‌కు కూడా గతంలో పట్టం కట్టారు ఓటర్లు. ఎన్టీఆర్‌, చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. గెలుపోటములను పక్కనపెడితే వారి పోటీ ప్రభావం సమీప నియోజకవర్గాలపైనా పడింది. ఇప్పుడు బీజేపీ కూడా అనే ప్లాన్‌ను నమ్ముకున్నట్టు ఉంది. అలనాటి హీరోయిన్లను బీజేపీలో చేర్చుకుని జరగబోయే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారానికి గ్లామర్‌ తీసుకు రాబోతున్నారు. పనిలో పనిగా ఫైర్‌బ్రాండ్‌ రోజా దూకుడికి కళ్లెం వేసే ప్లాన్‌ను కూడా ఇప్పుడు బీజేపీ అమలు చేయబోతుందట….

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గ్లామర్ షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాటి హీరోయిన్లు వాణీ విశ్వనాథ్‌, ప్రియారామన్‌లతో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. మంచి ముహూర్తం చూసుకుని కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారట కమలనాథులు. ముఖ్యంగా నగరిలో రోజాకు పోటీగా వచ్చే ఎన్నికల్లో వాణి విశ్వనాథ్‌ను బరిలో దించుతారని చెవులు కొరుక్కుంటున్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నుంచే దీనికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయబోతున్నారట.

నగరి నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తమిళనాడుకు సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడి ఓటర్లలో సగానికిపైగా తమిళ ఓటర్లే ఉంటారు. అందుకే గతంలో ఇక్కడ టీడీపీ పలు ప్రయోగాలు చేసింది. టీడీపీ నుంచి 1994లో నిర్మాత దొరస్వామిరాజు గెలిచారు. తర్వాత టీడీపీ నుంచి హీరోయిన్‌ రోజా బరిలో దిగినా సక్సెస్ కాలేదు. అయితే అదే రోజా వైసీపీలో చేరాక 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచారు. 2019లోనే వాణి విశ్వనాథ్‌ టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అప్పట్లో సీఎం చంద్రబాబుతోనూ ఆమె భేటీ అయ్యారు. నగరిలో రోజాపై వాణి విశ్వనాథ్‌ పోటీ చేస్తారని అనుకున్నారు. ఆ సమయంలో రోజా, వాణి విశ్వనాథ్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబానికి చంద్రబాబు టికెట్‌ ఇవ్వడంతో వాణి విశ్వనాథ్‌ టీడీపీలో చేరలేదు.

ఇప్పుడు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఉండటంతో నాడు టీడీపీ వేసిన ప్లాన్‌ను ఇప్పుడు బీజేపీ అమలు చేస్తోందట. రోజా ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ వాణి విశ్వనాథ్‌ను ప్రచారానికి పంపాలని అనుకుంటున్నారట. ఆమె కూడా వచ్చిన ఈ ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకోవద్దని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే రోజాకు సరైన కౌంటర్‌ ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీ నేతలకు వాణి విశ్వనాథ్‌ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వైసీపీ కొత్త చర్చ మొదలుపెట్టిందట. సినీ తారల వల్ల పెద్దగా ఉపయోగం లేదని.. గతంలోనూ వాణి విశ్వనాథ్‌ ఇలా వచ్చి అలా కనిపించకుండా పోయారని సెటైర్లు వేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news