ఏపీలో తుపాన్ ఎఫ్టెక్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రకాశం బ్యారేజీకి లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అయితే, బ్యారేజీ కెపాసిటీ లక్ష క్యూసెక్కులు తక్కువే అయినా బ్యారేజీ అంత భారీ వరదను సైతం తట్టుకుని నిలబడింది. అయితే, వరద ప్రవాహంలో కొట్టుకుని పోయిన రెండు ఇసుక బోట్లు బ్యారేజీలోని ఓ గేటును బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో దెబ్బతిన్న ఓ గేటును సోమవారం రాత్రి విశ్రాంత ఇంజినీర్ కన్హయ్య నాయుడు పరిశీలించారు.
ప్రస్తుతం బ్యారేజీకి ఇంకా ఇన్ ఫ్లో కొనసాగుతున్నందున వచ్చిన ప్రమాదం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. వరద ప్రవాహం తగ్గాక మరమ్మతులు చేపడతామని వెల్లడించారు. పనులు పూర్తయ్యే వరకు 15 రోజుల టైం పడుతుందని తెలిపారు. తుంగభద్ర డ్యాం తరహాలో ఇక్కడ గేట్ పూర్తిగా కొట్టుకుపోలేదని, కేవలం కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయని కన్హయ్య నాయుడు స్పష్టంచేశారు. ఇదిలాఉండగా, ప్రకాశం బ్యారేజీకి ఏమైనా జరిగితే విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో ముంపుగ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.