రెండు తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్‌సేన్ విరాళం..

-

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికీ చాలా మంది పేదలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. రెండు ప్రభుత్వాలు తమ వంతు సాయంతో పాటు రక్షణ చర్యలు కూడా చేపట్టాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆలస్యంగా స్పందించారని కొందరు ముంపు గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వర్షాల వలన జరిగిన నష్టం అంతా ఇంతాకాదు. ప్రస్తుతం అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నందున సెలబ్రిటీలు ముందుకు వచ్చి సాయం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరి కంటే ముందు తన ఉదారత స్వభావాన్ని చాటుకున్నారు.భారీ వర్షాలకు నష్టపోయిన రెండు రాష్ట్రాలకు తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది.అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్‌తో పాటే యంగ్ హీరో విశ్వక్ సేన్ ‌కూడా రూ.5లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news