రైలు ప్రయాణికులకు చేదు వార్త. ఇకపై ఫ్రీ ఇన్సూరెన్స్‌ ఉండదు..!

-

రైల్వే ప్రయాణికులకు నిజంగా ఇది చేదువార్తే. ఇకపై రైలు ప్రయాణికులు ఎలాంటి ఉచిత బీమా సదుపాయాన్ని పొందలేరు. అవును, మీరు విన్నది నిజమే. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ ఉచిత బీమా పథకాన్ని నిలిపివేయనున్నారు. ఈ మేరకు రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు వివరాలను వెల్లడించారు. అయితే ఉచిత బీమా సదుపాయం మాత్రమే తీసేస్తున్నామని, కానీ బీమా చేసుకునే సౌలభ్యాన్ని మాత్రం అలాగే ఉంచుతామని తెలిపారు. కాకపోతే అందుకు కొత్తం మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్‌ నుంచి ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ బీమా (ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌)ను రైల్వేశాఖ అందిస్తోంది. రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకోని ప్రమాదాలు ఏర్పడి వ్యక్తులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ ఇస్తున్నారు. అలాగే శాశ్వత అంగవైకల్యానికి కూడా ఇంతే మొత్తం అందిస్తున్నారు. ఇక పాక్షిక అంగవైకల్యానికి రూ.7.50 లక్షల వరకు, గాయాలకు రూ.2 లక్షల వరకు బీమాను రైల్వే శాఖ అందిస్తోంది.

కాగా సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ ఉచిత బీమా సౌకర్యాన్ని నిలివేస్తున్నామని రైల్వే శాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఆ తరువాత కూడా బీమా సౌకర్యం ఉంటుందని, కానీ దానికి కొంత ప్రీమియంను ముందుగా చెల్లించాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికులు టిక్కెట్లు బుక్‌ చేసుకునే సమయంలో బీమా కావాలా, వద్దా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలని, ఒక వేళ బీమా కావాలనుకుంటే టిక్కెట్‌ రుసుముతోపాటు బీమా ప్రీమియంను చెల్లించాలని, దీంతో ప్రయాణికులకు బీమా వర్తిస్తుందని తెలిపారు. అయితే ఇలా తీసుకునే బీమా ప్రీమియం ఎంత, దానికి ఎంత బీమా వస్తుంది అన్న వివరాలను అధికారులు చెప్పలేదు. త్వరలోనే వీటి గురించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version