ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి రీప్లేస్‌మెంట్ అనేదే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తేల్చి చెప్పారు.మోదీ త్వరలోనే రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో అమిత్‌షాను తదుపరి ప్రధానిని చేయనున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు . ఈ క్రమంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అమిత్‌షా కొట్టిపారేశారు. ‘ఇండియా’ కూటమికి ఎలాంటి శుభవార్త లేనందున ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తోందని, అబద్ధాలతో వారు ఎన్నికల్లో గెలవలేరని ఆయన అన్నారు.
”తూర్పు, పశ్చిమ, ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు చెందిన వారితో సహా దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ వెంటే ఉన్నారు. బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని ఇండియా కూటమి నేతలకు బాగా తెలుసు అని అన్నారు. బీజేపీ రాజ్యాంగంలో అలాంటి ప్రొవిజన్ ఏదీ లేదు. 2029 వరకూ మోదీనే ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు కూడా ఆయనే సారథ్యం వహిస్తారు అని తెలిపారు. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు. ఇండియా కూటమికి చెప్పుకోదగిన వార్త అంటూ ఏదీ లేకపోవడంతో ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. అబద్ధాలతో వారు ఎన్నికల్లో గెలవలేరు” అని అమిత్‌షా స్పష్టం చేశారు.