“లోక్ తంత్రమే జో లోక్ ప్రియా హై వోహీ నేతా హై “
ప్రజాస్వామ్య వ్యవస్థలో జనామోదం ఉన్నవాడే నాయకుడు అనేది పై వాక్యానికి అర్థం.ఆయన్ని అభిమానించవచ్చు, ద్వేషించ వచ్చు – ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి.కానీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రాభవాన్ని ఎవరూ కాదనలేరు.తనకు అత్యంత ప్రియమైన హిందుత్వ అంశాన్ని పక్కన పెట్టి మరీ!అభివృద్ధి నినాదంతో అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకుని ఆ రాష్ట్రంలో తన పార్టీని ఒంటిచేత్తో మరోసారి విజయ తీరాలకు చేర్చి చరిత్ర సృష్టించారు.
ఆయనే యోగి ఆదిత్యనాథ్.గోరఖ్ పూర్ పీఠాధిపతి నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఆయన జీవితంలో ఎన్నో మలుపులు.కానీ ఆయనలోని కొన్ని ప్రత్యేక గుణాలు మోడీ తరువాత అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతగా నిలబెడతున్నా యి.అవేంటో చూద్దామా !
ధైర్యవంతుడు :
యోగి మొదటి నుంచి చాలా ధైర్యవంతుడు.ప్రస్తుత రోజుల్లో కరుడు గట్టిన హిందుత్వ వాదుల జాబితాలో మొదటి స్థానం యోగికే దక్కుతుంది.ఒక సారి నిర్ణయం తీసుకుంటే ఎవరి కోసం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్ధపడరు. ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయినా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకు సాగారు.
తెలివైనవాడు :
ముఖ్యమంత్రి గా కాకముందు అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ నుంచే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని యోగికి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎప్పుడూ బయట పడలేదు. 2013 సమయంలో ఆ అవకాశం అమిత్ షా రూపంలో వచ్చింది.
2014 లో లోక్ సభ ఎన్నికల కోసం గోరఖ్ పూర్ ప్రాంతంలో పర్యటిస్తున్న అమిత్ షా కు తన ప్రయివేట్ సైన్యం తో బందోబస్తు ఏర్పాటు చేసి షా ను ఆకట్టుకున్నాడు.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి వర్గంలో చేరమని షా పంపిన ఆహ్వానం తిరస్కరించి యూపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలి అని ఆ రోజే తన నిర్ణయాన్ని నిర్మోహమాటంగా తెలియజేశారు.
2017 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గా తన పేరును షా ద్వారా చెప్పించారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి రాష్ట్ర రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దారు.
2022లో తిరిగి అధికారంలోకి వస్తామని రెండేళ్ల ముందే యోగి తన అనుచరులకు చెప్పారని ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
యాక్టివ్ :
విద్యార్థి దశలో యోగి అంత యాక్టివ్ పర్సన్ కాదని ఆయన జీవిత నేపథ్యం ఆధారంగా రాసిన పుస్తకం తెలుపుతుంది. కానీ గోరఖ్ పూర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టాక ఆయన వ్యవహార శైలే మారిపోయింది.అటుపై ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టిన తర్వాత ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు.ఆయన దూకుడు పార్టీ మైలేజీని పెంచింది.
శ్రద్ధ :
యోగి ప్రతి నిర్ణయం అమలులోనూ ఎంతో శ్రద్ధ వహిస్తారు. గోరఖ్ పూర్ పీఠం సన్యాసిగా మారిన తర్వాత నుంచి కేవలం మఠం వ్యవహారాలకే పరిమితం కాకుండా అక్కడి ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించిన వారి సమస్యలను శ్రద్ధగా వినేవారు.
ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పరిపాలనా విషయాలు గురించి తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు,అమలు చేయబోతున్న పలు సంక్షేమ పథకాలు, రాష్ట్ర బడ్జెట్ గురించి ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన తీసుకున్న పలు చర్యలు కూడా బీజేపీని మరోసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయ తీరాలకు చేర్చేందుకు ముఖ్య కారణం.
– పొలిటికల్ ఎఫైర్స్ – మనలోకం ప్రత్యేకం