సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతితో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు తన అభిరుచి మేరకు కొన్ని చిత్రాలను తీయాలనుకున్నారు. ఆయన నటించిన చిత్రాలను తన నట వారసుడు ప్రభాస్‌తో మళ్లీ రూపొందించాలనుకున్నారు. ఇదే విషయాన్ని పలు వేదికలపైనా, ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. అయితే, వివిధ కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు.
భక్తకన్నప్ప.. కృష్ణంరాజు కెరీర్‌లో మైలురాయిలాంటి సినిమా. ఈ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా మళ్లీ రీమేక్ చేద్దామనుకున్నారు. నేటి పరిస్థితులు, సాంకేతికతకు అనుగుణంగా స్క్రిప్ట్ కూడా తయారు చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌పై తానే దర్శకత్వం వహించాలని ఆశపడ్డారు. కానీ, ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడమే కాకుండా పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో ‘భక్తకన్నప్ప’ పట్టాలెక్కలేదు. ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’లో డైలాగ్ ‘ఒక్క అడుగు’ పేరుతో ఓ కథ సిద్ధం చేశారు కృష్ణంరాజు. మల్టీస్టారర్‌గా తీయాలనుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఓ పాత్ర చేయాల్సి ఉంది. చిత్ర పరిశ్రమలోని పలువురు పెద్ద రచయితలు ఈ కథపై కసరత్తు చేశారు. సినిమా ప్రకటన కూడా వచ్చినా.. కొబ్బరికాయ మాత్రం కొట్టలేదు. నెరవేరని కృష్ణంరాజు కలలు.. ఆ సినిమాలు తీద్దామనుకున్నారు!
కృష్ణంరాజుకు ‘విశాల నేత్రాలు’ నవలంటే ఎంతో ఇష్టం. దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో దాని ప్రస్తావన వచ్చినా.. కార్యరూపం దాల్చలేదు. కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజుకు గవర్నర్‌గా పనిచేయాలని ఉండేది. ఒకానొక సందర్భంగా ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ, అది నిజం కాలేదు. కృష్ణంరాజుకు అన్ని విధాలా నచ్చిన చిత్రం ‘మన ఊరి పాండవులు’. దాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే, ప్రభాస్‌ను పెట్టి తీయాలనుకున్నారు. సినిమాలు, దర్శకత్వం చేయడం కన్నా తన నట వారసుడు ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఉవ్విళ్లూరుతూ ఉండేవారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ కృష్ణంరాజును ఈ ప్రశ్న అడిగేవారు. ఈ ప్రశ్న అడగగానే ఆయన కూడా సంతోషపడిపోయేవారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పెళ్లిపై వార్తలు బాగా హల్‌చల్ చేశాయి. వీటిపై కృష్ణంరాజు కూడా స్పందించారు. అయితే, వరుస ప్రాజెక్టులు కారణంగా ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది.