రోజంతా కంప్యూటర్ కీబోర్డ్ పై చేతులు కదపడం ఫోన్ని పట్టుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఈ ఆధునిక జీవనశైలిలో,అకస్మాత్తుగా మీ చేతి వేళ్లలో మొద్దుబారడం లేదా మంటగా అనిపించడం మొదలవుతుందా? ఈ చిన్నపాటి అసౌకర్యం ఒక్కోసారి తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చు, దాని పేరే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (CTS). ఇది మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏమిటి? మరీ ముఖ్యంగా, మీ చేతులను సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లక్షణాలు: కార్పల్ టన్నెల్ అనేది మీ మణికట్టులో ఉండే ఒక చిన్న మార్గం (Tunnel). ఈ మార్గం గుండానే మీడియన్ నెర్వ్ అనే ప్రధాన నరం మీ చేతిలోకి వెళుతుంది. కీబోర్డ్ వాడకం, చేతులకు అధిక పని వంటి కారణాల వల్ల ఈ మార్గం సన్నబడి నరంపై ఒత్తిడి పెరిగినప్పుడు CTS వస్తుంది. దీని ప్రధాన లక్షణాలు రాత్రి వేళల్లో మొదలవుతాయి.
వేళ్లలో ముఖ్యంగా బొటనవేలు చూపుడు వేలు, మధ్య వేలు మరియు ఉంగరపు వేలు సగం వరకు మొద్దుబారడం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం దీని ముఖ్య లక్షణం. ఉదయం నిద్ర లేచేసరికి చేతిలో పట్టు కోల్పోవడం వస్తువులను పట్టుకోలేకపోవడం జరుగుతుంది. కొంతమందికి నొప్పి భుజం వైపుగా కూడా పాకవచ్చు. తరచుగా మణికట్టును వంచడం లేదా ఒకే స్థితిలో ఉంచడం ఈ లక్షణాలను మరింత పెంచుతుంది.

తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు: CTS తీవ్రతరం కాకుండా ఉండాలంటే, ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మొదటి జాగ్రత్త, మీరు పనిచేసేటప్పుడు మీ మణికట్టు యొక్క భంగిమ (Posture) సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కీబోర్డ్, మౌస్ వాడేటప్పుడు చేతులు లేదా మణికట్టు నేలపై లేదా డెస్క్ అంచున నొక్కకుండా, సమంగా ఉంచాలి. దీనికోసం మణికట్టు సపోర్ట్ ప్యాడ్స్ వాడవచ్చు.
రెండవ జాగ్రత్త, ప్రతి గంటకు 10-15 నిమిషాలు విరామం తీసుకుని చేతికి మరియు మణికట్టుకు సులభమైన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. దీనివల్ల నరంపై ఒత్తిడి తగ్గుతుంది. మూడవ జాగ్రత్త రాత్రి నిద్రపోయేటప్పుడు మణికట్టును వంచి పడుకోకుండా ఉండటానికి డాక్టర్ సలహా మేరకు స్ప్లింట్ ధరించడం ఉపశమనాన్ని ఇస్తుంది. అతి ముఖ్యంగా చేతికి ఎక్కువ శ్రమ కలిగించే పనులను కొద్ది రోజులు తగ్గించడం లేదా ఆ పని చేసే పద్ధతిని మార్చుకోవడం చాలా అవసరం.
గమనిక : పైన చెప్పిన లక్షణాలు మీకు తీవ్రంగా ఉంటే, లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంటే వెంటనే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ లేదా న్యూరాలజిస్ట్ ను సంప్రదించడం తప్పనిసరి.
