ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది. ఇంతకుముందు ఏది పడితే అది ఎలా పడితే అలా తినేవారు, ఇప్పుడలా తినడానికి జంకుతున్నారు. కరోనా కారణంగా చెడు జరిగిన మాట నిజమే కానీ, అందరికీ ఆరోగ్యం పట్ల ఆసక్తి కలిగింది. ఐతే ప్రస్తుతం చలికాలం నడుస్తుంది. అన్ని కాలాల్లో కంటే ఈ కాలంలో వ్యాధుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం సరైనది కాకపోతే ఆ ఇబ్బందులు ఎక్కువవుతాయి. అదీగాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గరే ఉండడంతో బరువు పెరగడం వంటి సమస్యలు తెలెత్తుతున్నాయి. ఇంకా ఇతర అనేక సమస్యలు కలుగుతున్నాయి. ఇలాంటి సమస్యలకి దూరంగా ఉండడానికి కావాల్సిన ఆహారాలేంటో చూద్దాం.
వెల్లుల్లి:
మీరు వెల్లుల్లి అభిమానులైతే చలికాలంలో దానంత మంచి ఆహారం లేదనే చెప్పాలి. అందులో ఉండే సెలేనియం, జర్మేనియం ఇంకా ఇతర ఆమ్లాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది నేచురల్ యాంటీ బయాటిక్ గా పనిచేసి, మూత్రసంబంధిత ఇబ్బందులైన్ దూరం చేస్తుంది.
దాల్చినచెక్క :
ప్రతీ ఒక్కరి వంటగదిలో ఉండే దాల్చిన చెక్క ఆరోగ్యాన్ని అందించడంలో సాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. అంతేకాదు రక్తంలో చక్కెర నిల్వలని నియంత్రణలో ఉంచుతాయి. అందుకే పొద్దున్న పూట టీ తాగేటపుడు దాల్చిన చెక్క ఆహారంగా తీసుకుంటే మంచిది.
బాదం:
చెడు కొవ్వుని తగ్గించి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుతాయి. రాత్రి నానబెట్టిన బాదంని పొద్దున్న పొద్దున్న పూట ఆహారంగా తీసుకుంటే మంచిది.
స్వీట్ పొటాటో:
ఇందులో పొటాషియం, విటమిన్ ఏ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.
సిట్రస్ ఫలాలు:
సిట్రస్ ఫలాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సాయపడతాయి. నిమ్మ, నారింజ, జామ, బత్తాయి మొదలగునవి సిట్రస్ ఫలాల కిందకి వస్తాయి.