తలనొప్పి ప్రాణాపాయానికి దారితీస్తుందా? తలనొప్పి వెనక కారణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

-

తలనొప్పి – రోగులు వైద్యుల దగ్గరికి వచ్చే ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ తలనొప్పి రెండు రకాలు – ప్రాథమిక ( ఎటువంటి ఇతర కారణం లేనివి ) లేదా పర్యవసాన ( ఇతర కారణాల వలన).

 

headache

తలనొప్పికి భయపడాలా ! వద్దా !

జలుబుతో వచ్చే తలనొప్పి చాల సాధారణం కానీ ప్రమాదం లేనిది అలాగే ప్రాణాపాయ తలనొప్పి అరుదు కానీ దానిని గుర్తించి వెంటనే చికిత్స చెయ్యాలి. ఇలాంటి తలనొప్పిని గుర్తించడానికి కింది లక్షణాలు ఉపయోగపడతాయి.

1. హఠాత్తుగా వచ్చిన తలనొప్పి ( అంటే సెకండ్ల వ్యవధిలో )
2.మొదటిసారి వచ్చిన తీవ్రమైన తలనొప్పి
3.ఇంతవరకు వచ్చిన తలనొప్పుల్లో ఇదే అధమం అయినప్పుడు
4.రోజులు లేదా వారం వ్యవధిలో అంతకంతకు పెరిగే తలనొప్పి
5.వంగినప్పుడు,బరువులెత్తినపుడు,దగ్గినప్పుడు వచ్చే తలనొప్పి

6.నింద్రాభంగం కలిగించే నొప్పి లేదా నిద్ర లేచిన వెంటనే వచ్చే తలనొప్పి
7.ఏదైనా శారీరిక రోగంతో పాటు వచ్చే నొప్పి – ఉదా గుండె ,కాలేయం ,మూత్రపిండాల జబ్బు
8.55ఏళ్ళ తరువాత వచ్చే తలనొప్పి
9.జ్వరం తో కూడిన తలనొప్పి
10. వాంతి తరువాత వచ్చే తలనొప్పి
11. కణతలో నొప్పితో వచ్చే తలనొప్పి.

సాధారణంగా ప్రాథమిక తలనొప్పితో డెబ్బై శాతం ఒత్తిడి తలనొప్పి ఉంటుంది. ఇది ఆందోళన, దిగులు మొదలైన మానసిక కారణాల వలన వస్తుంది. ఈ నొప్పి తల చుట్టూ బిరుసుగా ఒక పట్టీ కట్టినట్లు ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఈ నొప్పి వలన ప్రాణాపాయం ఏమీ ఉండదు.

ఆ తరువాత మరో పదహారు శాతం పార్శ్వ నొప్పి. దీనినే మైగ్రైన్ అంటారు. దీనిదో పెద్ద కథ. ఆకలి,నిద్ర లేమి, కాంతి, ఒత్తిడి, అతి నిద్ర, చాకోలెట్లు,వాతావరణ అల్పపీడనం మొదలైన సవాలక్ష విషయాలు ఈ నొప్పిని తీసుకొస్తాయి. ఇది ముఖానికి, తలకి ఓక వైపు ఉంటుంది ఈ నొప్పితో పాటు వికారం, వాంతులు, కళ్ళలో రంగుల రింగులు తిరగడం మొదలైన లక్షణాలు ఉంటాయి. దీనికి కూడా విశ్రాంతి తీసుకుని సాధారణ నొప్పి మాత్రలు వేసుకుంటే తగ్గుతుంది. మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అలాగే కొంతమందిలో వ్యాయామం తర్వాత తలనొప్పి వస్తుంది కానీ ఇది అరుదు.

ఇకపోతే ఇన్ఫెక్క్షన్ల వలన వచ్చే తలనొప్పి పర్యవసాన తలనొప్పుల్లో 63శాతం ఉంటుంది. అది సాధారణ జలుబు నుండి మెదడువాపు వ్యాధి వరకు కొన్ని వందల రకాల కారణాలు ఉంటాయి. అవి వైరస్, బాక్టీరియా, ఫంగల్ లేదా పారసైట్ ఇన్ఫెక్షన్లు ఏవైనా కావచ్చు. ఆ తర్వాతి వరసలో తలకి గాయం వలన వచ్చే తలనొప్పి, అలాగే రక్తనాళాల సమస్యల వలన వచ్చే తలనొప్పులు అరుదు అయినా ఇవి ప్రమాదకరం. అయితే మెదడులో కణుతుల వలన వచ్చే తలనొప్పి 0.1శాతం. కాబట్టి తలనొప్పి రాగానే కాన్సర్ వచ్చేసింది అనుకొని కంగారు పడిపోకూడదు. కంగారు ఎక్కువ పడేవారు గూగుల్ చెయ్యకపోవడమే మంచిది.

స్కానింగ్ అవసరమా?

తలనొప్పి కి మెదడు,దానిచుట్టూ ఉండే పొరలు,రక్తనాళాలు,కళ్ళు,చెవులు, ముక్కు,ముక్కు చుట్టూ ఉండే గాలి గదులు, తలపైనుండే చర్మం, రక్త పోటు, కపాలం ,దవడలు,పళ్ళు, అంగిలి, మెదడులో నీరు, ముఖ కండరాలు, వాటికి వెళ్లే నరాలు, అన్నిటికి మించి మనసు ఇలా ఇవన్నీ కారణాలు కావచ్చు. వీటిలో ఏది కారణం అన్నది కాసేపు కూర్చుని మాట్లాడి, పరీక్ష చేసే వైద్యుడి వలనే సాధ్యం. కేవలం స్కానింగ్ వలన సులువుగా తెలిసిపోతుంది అన్నది అపోహ. మనసుకి తెలియనిది కళ్ళు చూడలేవు, కాబట్టి ఫలానాది కారణం కావచ్చు అన్న అనుమానం లేనప్పుడు అది కారణం ఉన్నా కూడా స్కానింగ్ చూసే వైద్యుడికి కనపడదు. అన్ని తలనొప్పులకు స్కానింగ్ అవసరం లేదు. ఎవరికైతే నాడీ వ్యవస్థ పరీక్షలో లోపాలు కనపడతాయో, అలాగే ఇటీవల వచ్చిన తీవ్రమైన తలనొప్పికి స్కానింగ్ తీసినపుడు లోపల ఏదైనా తేడా ఉంటే కనిపిస్తుంది అందరికీ కనిపించదు. అలాగే కొన్నిసార్లు వెన్ను నీరు తీసి కూడా పరీక్షించాలి.

మందుల వాడకం

మందుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అధికంగా మందులు తీసుకోవడం వలన తలనొప్పి అధికం అయ్యే అవకాశం ఉంది. అలాగే అధిక నొప్పి మాత్రల వలన కడుపులో పుళ్లు రావడం, మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుంది. తలనొప్పి రాకుండా కొన్ని మందులు ఉంటాయి, అవి వైద్యుడి సలహా మేరకు క్రమం తప్పక వాడాలి.లా సార్లు చక్కటి నిద్ర, వ్యాయామం, యోగ, ధ్యానం చెయ్యటం, మద్యం మరియు ధూమపానానికి దూరంగా ఉండటం బాగా సహాయపడతాయి. భారతీయుల్లో దిగులు వ్యాధి ఎక్కువగా తలనొప్పితో మొదలవుతుంది వీరికి మానసిక చికిత్స అవసరం.

మిర్యాల శ్రీకాంత్ (సైకియాట్రిస్ట్)

Read more RELATED
Recommended to you

Latest news