ఈ మధ్య కాలంలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి. గతంలో గుండె జబ్బులు మధ్య వయస్కులకు, వృద్ధులకు వస్తుందని మాత్రమే భావించే వారు. కానీ ప్రస్తుతం వయసుతో అస్సలు సంబంధం లేకుండా పలువురు గుండె పోటు వల్ల మరణిస్తున్నారు. అప్పటి వరకు బంధు, మిత్రులతో సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి అకాస్మత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా చోటు చేసుకుంటున్నాయి.
లక్నోలో తొమ్మిదేళ్ల బాలిక కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించింది. ఒక రకంగా చెప్పాలంటే గుండె పని చేయకపోవడంతోనే మరణించింది. మాంట్ ఫోర్ట్ స్కూల్ లో తొమ్మిదేళ్ల బాలిక మూడో తరగతి చదువుతోంది. స్కూల్ లో ఆడుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిందని ప్రిన్సిపల్ వెల్లడించారు. మూడో తరగతి చదువుతున్న మాన్విసింగ్ ఆట స్థలంలో అపస్మారక స్థితిలో పడటంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు ప్రిన్సిపాల్. ఈ బాలికను ఆమె కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్టు డాక్టర్లు చెప్పినట్టు ప్రిన్సిపాల్ వివరించారు. ఈ బాలిక మరణించడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు.