విలాసవంతమైన జీవితం.. మంచి ఉద్యోగం.. పిల్లలు.. ఇల్లు.. రోజూ మూడు పూటలా నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్తాయి. ఎవరికీ ఇంతకంటే కావల్సింది ఇంకా ఏమీ ఉండదు కదా.. అయితే.. కేవలం తాను తింటేనే సరిపోదు అనుకుంది ఆమె.. తన చుట్టూ సమాజంలో ఉన్న పేదవారి కడుపూ నిండాలని భావించింది. అందుకనే ఆమె.. తన ఉద్యోగాన్ని కూడా మానేసి.. నిత్యం తానే స్వయంగా ఆహారాన్ని వండి మరీ వీధుల్లో పేదలకు పంచుతోంది.. ఆమే.. ఢిల్లీకి చెందిన సరితా కశ్యప్..!
ఢిల్లీలోని మీరాబాగ్లో ఉండే సరితా కశ్యప్‌కు ఒక్కరే సంతానం. ఆమె ఆటోమొబైల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. జీతం కూడా బాగానే వస్తుంది. అయితే అది ఆమెకు తృప్తినివ్వలేదు. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక్కటే కోరిక. తాను నిత్యం తన కడుపు నింపుకోవడమే కాదు.. తన చుట్టూ ఉన్న పేదల ఆకలినీ తీర్చాలని ఆమె అనుకునేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి ఆమె గుడ్‌బై చెప్పింది. 2019 జనవరి నెలలో ‘అప్నా పన్ రాజ్మా చావల్ (Apna Pann Rajma Chawal)’ పేరిట పశ్చిమ ఢిల్లీలోని పీరా గర్హి అనే ప్రాంతంలో ఓ ఫుడ్‌స్టాల్‌ను ఏర్పాటు చేసి.. నిత్యం పేదల ఆకలి తీరుస్తోంది.
సరితా కశ్యప్ దినచర్య ఉదయం 4 గంటలకే మొదలవుతుంది. ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని ఆమె ఉదయం 11.30 గంటల వరకు 100 మందికి సరిపోయే విధంగా రాజ్మా, చావల్ వండుకుని.. ఆహారన్నంతా తన స్కూటీ క్యారేజ్‌పై పెట్టుకుని.. మీరాబాగ్ నుంచి పీరా గర్హికి వెళ్తుంది. అక్కడే 3-4 గంటల పాటు స్టాల్లో ఆ ఆహారాన్ని అమ్ముతుంది. రూ.40, రూ.60లకు రెండు భిన్న సైజుల్లో ఆహారాలను ప్యాక్ చేసి ఆమె విక్రయిస్తుంది. అయితే అది డబ్బు పెట్టి కొనుగోలు చేసే స్థోమత ఉన్నవారికే సుమా.. డబ్బు లేని వారికి ఆమె ఆ ఆహారాన్ని ఉచితంగానే ఇస్తుంది.
ఈ క్రమంలో సరితా కశ్యప్ చేస్తున్న పని గురించి తెలిసి కొందరు పేదలు.. పీరా గర్హికి ఆమె వచ్చే సమయం కన్నా ముందుగానే అక్కడికి చేరుకుంటారు. వారిలో కొందరు పిల్లలు కూడా ఉంటారు. వారంతా తమ తల్లి కాని తల్లి.. సరితా కశ్యప్ ఇచ్చే ఆహారం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆమె రాగానే వారికి ఆ ఆహారాన్ని ఇచ్చేస్తుంది. తరువాత కొంత ఆహారాన్ని ప్యాక్‌లలో అమ్ముతుంది. దీంతో ఆమెకు మళ్లీ మరుసటి రోజు ఆహారం వండేందుకు కావల్సిన సొమ్ము వస్తుంది. అలాగే కొంత సొమ్మును ఆమె తన ఇంటి అవసరాల కోసం పక్కన పెడుతుంది. అలా సరితా కశ్యప్ అటు ఇంటిని ఓ వైపు.. సామాజిక సేవను ఓ వైపు చేస్తూ.. అందరిచే ప్రశంసలు అందుకుంటోంది.. సరితా కశ్యప్ చేస్తున్న సేవను మనమందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే..!