సమాజంలో కేవలం మనం మాత్రమే జీవించడం కాదు.. మన చుట్టూ ఉన్న వారు కూడా జీవించాలి.. అందుకు వారికి మనకు తోచినంత సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. వారిపై జాలి చూపించాలి. కష్టాలు వస్తే అండగా నిలబడాలి. అవును.. సరిగ్గా ఆ యువతి కూడా అదే చేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న వారికి బాసటగా నిలుస్తోంది. తాను కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. ఇప్పటి వరకు తన జీతం మొత్తాన్ని ఇతరులకు సహాయం చేయడం కోసమే ఆమె విరాళంగా ఇచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే.. వరంగల్‌కు చెందిన తాటి ఆశ్లేష..
ఆశ్లేష వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ నర్సింగ్ విభాగంలో బీఎస్సీ నర్సింగ్ చదివింది. అనంతరం ఆమెకు హైదరాబాద్ నగరంలోని ఈఎస్ఐ హాస్సిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా జాబ్ లభించింది. అయితే తన మొదటి నెల వేతనం రూ.70,308ను తాను చదువుకున్న కళాశాలకే విరాళంగా అందజేసింది. కళాశాల అభివృద్ధి కోసం ఆ మొత్తాన్ని అందజేసింది. ఇక తన రెండో నెల జీతాన్ని తాను పుట్టి పెరిగిన.. ములుగు జిల్లాలోని వెంకటాపురం అనే గ్రామ అభివృద్ధికి అందజేసింది. అలాగే తన 3వ నెల జీతాన్ని వరంగల్ నగరంలోని పెయింటర్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు నిత్యావసరాలను అందజేయడం కోసం విరాళంగా ఇచ్చింది.
వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ పేదలకు నిత్యావసరాలను అందజేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆశ్లేష నగరంలోని పెయింటర్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు నిత్యావసరాలను అందజేయాల్సిందిగా చెబుతూ.. తన మూడవ నెల వేతనాన్ని దాస్యం వినయ్ భాస్కర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఆయన ఆశ్లేషను అభినందించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వరుసగా 3 నెలల పాటు తన రూ.2 లక్షలకు పైగా జీతం డబ్బులను సామాజిక సేవ కోసమే ఇవ్వడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. కాగా ఆశ్లేష తండ్రి సత్యనారాయణ హన్మకొండలో పెయింటర్‌గా పనిచేస్తుండగా.. తల్లి జ్యోతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.