దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం వల్ల మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ల ధరలు విపరీతంగా పెరిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే కేంద్రం వాటి ధరలను యథావిధిగానే ఉంచాలని, ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే కేరళలోని ఆ మెడికల్ షాపు వారు మాత్రం కేవలం రూ.2కే మాస్క్‌లను విక్రయిస్తూ.. అందరి అభిమానం చూరగొంటున్నారు.
కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ మెడికల్ అండ్ సర్జికల్ షాపులో కేవలం రూ.2కే కరోనా మాస్కులను విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ షాపు ఓనర్లైన నదీమ్, తస్లీంలను మీడియా ప్రశ్నించగా, వారు స్పందిస్తూ.. తాము రూ.8 నుంచి రూ.10కి మాస్కులను తెచ్చి వాటిని కేవలం రూ.2కే విక్రయిస్తున్నామని, కానీ ఇతర షాపుల వారు రూ.25కి మాస్కులను అమ్ముతున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో తాము కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5వేల మాస్కులను అమ్మామని తెలిపారు.
కాగా రానున్న మరో 100 రోజుల వరకు కేంద్ర ప్రభుత్వం ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను నిత్యావసరాలుగా గుర్తించి, కావల్సినన్నింటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని తయారీదార్లను ఆదేశించింది. ఈ క్రమంలో ఆ మెడికల్ షాపు వారు కేవలం రూ.2కే ఫేస్ మాస్కులను అందిస్తుండడం నిజంగా అభినందనీయమే..!