కరోనా వైరస్ నేపథ్‌యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో.. జనాలు తమకు నిత్యావసరాలు, కూరగాయాలు అందుతాయా.. లేదా.. అని ఆందోళన చెందుతున్నారు. ఇక కొన్ని చోట్ల ఆయా సరుకుల కోసం షాపుల వద్ద వారు బారులు తీరుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని అందరూ భయపడుతున్నారు. అయితే ఇలాంటి భయాలు, ఆందోళనలు, అనుమానాలకు చెక్ పెడుతూ.. ఆ స్టార్టప్.. ప్రజలకు వారి ఇళ్ల వద్దకే నిత్యావసరాలను డెలివరీ ఇస్తోంది. వాట్సాప్‌లో ఆర్డర్లు తీసుకుంటూ.. ప్రజలకు కావల్సిన కూరగాయలు, పండ్లను వారి ఇళ్ల వద్దకే అత్యంత సురక్షితమైన పద్ధతిలో పంపుతోంది. దీంతో ఆ స్టార్టప్ ఇప్పుడు పెద్ద ఎత్తున పండ్లు, కూరగాయలను ముంబైలోని ప్రజలకు రోజూ డెలివరీ చేస్తోంది.
ముంబైకి చెందిన Agrify Organic Solutions అనే స్టార్టప్ జనాలకు కావల్సిన పండ్లు, కూరగాయాలను నిత్యం అందించేందుకు ఓ వినూత్న పద్ధతిని అవలంబిస్తోంది. ఈ స్టార్టప్‌కు చెందిన సిబ్బంది మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల వద్దకు వాహనాలను నిత్యం పంపిస్తారు. ఈ క్రమంలో రైతులు తమ వద్ద పండే పండ్లు, కూరగాయలను ఆ వాహనాల్లో లోడ్ చేస్తారు. తరువాత ఆ వాహనాలు సిటీకి చేరుకుంటాయి. ఈ క్రమంలో ఆ వాహనాల్లో ఉండే పండ్లు, కూరగాయాలను వేరు చేసి వాటిని ప్రత్యేకంగా రూపొందించిన బాక్సుల్లో.. అత్యంత సురక్షితమైన పద్ధతిలో ఉంచుతారు. తరువాత ఆ బాక్సులకు సీల్ వేస్తారు. ఇక స్టార్టప్ సిబ్బంది వాట్సాప్‌లో సిటీలో ఉండే జనాల నుంచి ఆర్డర్లు తీసుకుంటారు. ఆ ఆర్డర్ల ప్రకారం వారు.. జనాలకు కావల్సిన పండ్లు, కూరగాయాలను ఆ బాక్సుల్లో డెలివరీ చేస్తారు. ఇక వినియోగదారులు డెలివరీ అందుకున్నాకే.. స్టార్టప్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీ తమకు వచ్చే డబ్బులతో రైతులకు పేమెంట్లు చేస్తారు. ఇలా ఎవరూ బయటకు రావాల్సిన అవసరం లేకుండానే నిత్యం తాజా కూరగాయలు, పండ్లను జనాలు కొనుగోలు చేయవచ్చు.
ఇక అగ్రిఫై సొల్యూషన్స్ తయారు చేసే బాక్సులను పూర్తిగా సురక్షితంగా ఉంచుతారు. అవి మూడు రకాల భిన్న సైజుల్లో ఉంటాయి. ఒక బాక్సులో భిన్నరకాల పండ్లు, కూరగాయాలు కలిపి ఉంటాయి. ఆ బాక్సు ధర రూ.650. అలాగే రెండో బాక్సులో కేవలం కూరగాయలు మాత్రమే ఉంటాయి. దాని ధర రూ.550. ఇక ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లేని మరొక బాక్సు ఉంటుంది. అందులో ఇతర పండ్లు, కూరగాయలు అన్నీ ఉంటాయి. దాని ధర రూ.600. ఈ క్రమంలో వినియోగదారులు తమకు నచ్చిన బాక్సును ఆర్డర్ చేయవచ్చు. అయితే ఒక్కో బాక్సులో ఉండే పండ్లు, కూరగాయల బరువు దాదాపుగా 11 కిలోల వరకు ఉంటుంది. ఇక వినియోగదారులు కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే నగదు చెల్లించాలి. క్యాష్ తీసుకోరు. దీని వల్ల చాలా సురక్షితమైన విధానంలో ప్రజలు నిత్యం పండ్లు, కూరగాయలను కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల ఎవరైనా సరే.. తమకు కూరగాయలు, పండ్లు లభిస్తాయా.. లేదా.. అన్న ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు.
కాగా అగ్రిఫై సొల్యూషన్స్ మార్చి 28వ తేదీన ఈ సేవలను ప్రారంభించగా.. కేవలం రెండు రోజుల్లోనే 10వేల వరకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఆ ఆర్డర్లను ప్రస్తుతం ఆ కంపెనీ డెలివరీ చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు తాత్కాలికంగా ఆర్డర్లను నిలిపివేశారు. మళ్లీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి యథావిధిగా ఈ కంపెనీ ఆర్డర్లను స్వీకరించనుంది. ఏది ఏమైనా.. ఈ స్టార్టప్ కంపెనీ ఆలోచించిన ఐడియా భలేగా ఉంది కదా.. దీని వల్ల కరోనా వ్యాప్తిని సమూలంగా అడ్డుకోవచ్చు..!