మద్యం సేవించే కొద్దీ మందు బాబులకు తీవ్రమైన నిషా ఎక్కుతుందన్న విషయం తెలిసిందే. మద్యం డోసు పెరిగేకొద్దీ మత్తు ఎక్కువవుతుంది. ఆ మత్తు నుంచి బయట పడాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఇందుకు శరీరంలోని అవయవాలన్నీ.. ముఖ్యంగా లివర్ ఎంతగానో శ్రమించాల్సి వస్తుంది. అయితే ఈ ఇబ్బందిని అధిగమించేందుకు గాను కెనడా సైంటిస్టులు ఓ నూతన డివైస్‌ను రూపొందించారు. సదరు డివైస్ మద్యం మత్తును కొన్ని నిమిషాల వ్యవధిలోనే తొలగిస్తుంది.
టొరంటో జనరల్ హాస్పిటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన జోసెఫ్ ఫిషర్ అనే సైంటిస్టు, ఆయన బృందం కలిసి ఓ నూతన తరహా డివైస్‌ను రూపొందించారు. ఆ డివైస్ వ్యక్తి రక్తంలో ఉండే ఆల్కహాల్‌ను వెంటనే తొలగిస్తుంది. దీంతో మద్యం మత్తు నుంచి బయట పడుతారు. ఒక రకంగా చెప్పాలంటే రక్తంలో ఉండే ఆల్కహాల్‌ను ఆ డివైస్ వాక్యూమ్ చేసినట్లు బయటకు లాగుతుంది. దీన్నే హైపర్ వెంటిలేషన్ అంటారు. అయితే ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ కూడా బయటకు వస్తుంది. దీంతో ఈ ప్రక్రియలో వ్యక్తులకు తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో స్పృహ తప్పి పడిపోతారు.
అయితే అలా కార్బన్ డయాక్సైడ్ బయటకు రాకుండా ఉండేందుకు గాను డివైస్‌కు చిన్న మార్పులు చేశారు. దీంతో వ్యక్తి శరీరంలో ఉండే రక్తం నుంచి ఆల్కహాల్ మాత్రమే తొలగించబడుతుంది. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు నియంత్రణలోనే ఉంటాయి. ఇక ఆ డివైస్‌పై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే దాన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తేనున్నారు.
అయితే సదరు డివైస్‌ను తయారు చేసేందుకు ఎలాంటి భారీ సామగ్రి అవసరం లేదని, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ ఏవీ అవసరం లేదని ఫిషర్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా దాన్ని సులభంగా తయారు చేయవచ్చన్నారు. ప్రస్తుతం మద్యం మత్తులో హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్ల రక్తం నుంచి ఆల్కహాల్‌ను తొలగించేందుకు డయాలిసిస్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని, కానీ దాని వల్ల ఆలస్యం జరుగుతుందని, అదే తమ డివైస్‌తో అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యక్తి రక్తం నుంచి ఆల్కహాల్‌ను పూర్తి బయటకు లాగవచ్చని తెలిపారు. దీని వల్ల లివర్ పై భారం పడకుండా ఉంటుందన్నారు. ప్రతి ఏడాది మద్యం విపరీతంగా సేవించడం వల్ల అనేక మంది లివర్ వ్యాధులకు గురై చనిపోతున్నారని, ఈ డివైస్ వల్ల అలాంటి మరణాలు తగ్గుతాయని చెప్పారు.