కరోనా వైరస్ ఏమోగానీ.. ఆ వైరస్ బారిన పడతామేమోనని జనాలు విపరీతంగా భయపడుతున్నారు.. అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నారు. కానీ.. ఏమో.. అనుకోకుండా కరోనా సోకితే ఎలా..? అనే భయం చాలా మంది ప్రజలు వెంటాడుతోంది. అయితే ఆ గ్రామంలోని ప్రజలకు మాత్రం ఆ భయం కాస్త ఎక్కువగానే పట్టుకుంది. దీంతో వారు కరెన్సీ నోట్లను ఏకంగా సబ్బు నీటిలో కడుగుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య పట్టణానికి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరనచకనహల్లి అనే గ్రామంలో ప్రజలు కరెన్సీ నోట్లను ఇతరుల నుంచి తీసుకున్నాక వాటిని సబ్బు నీటిలో బాగా కడిగి.. వాటిని ఎండలో ఆరబెడుతున్నారు. అవి ఆరాకగానీ వారు వాటిని తీసుకోవడం లేదు. అక్కడ సిల్క్ కొకూన్లను అమ్మే రైతులు తమకు వ్యాపారులు డబ్బులు చెల్లించగానే వాటిని సబ్బు నీటిలో కడుగుతున్నారు. చాలా మందికి డిజటల్ పేమెంట్ల పట్ల అవగాహన లేదు. దీంతో వారు వ్యాపారుల నుంచి తప్పనిసరిగా నగదునే తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో క్యాష్ తీసుకున్నాక.. రూ.2వేలు, రూ.500, రూ.100 నోట్లను వారు సబ్బు నీటిలో కడుగుతున్నారు.
అయితే ఆ గ్రామవాసులు అలా చేసేందుకు కారణం కూడా ఉంది. సోషల్ మీడియాలో పలువురు కరెన్సీ నోట్లను నాకుతూ.. తుమ్ముతూ.. ఉమ్ముతూ.. పెడుతున్న వీడియోలను వారు చూస్తున్నారు. దీంతో కరెన్సీ నోట్ల ద్వారా తమకు కరోనా ఎక్కుడ సోకుతుందోనని వారు భయపడి అలా నోట్లను కడుగుతున్నారు. దీనిపై స్పందించిన అక్కడి అధికారులు మాట్లాడుతూ.. ఆ గ్రామవాసులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. వారు డిజిటల్ విధానంలో పేమెంట్లను స్వీకరించేలా చేయడంతోపాటు.. చేతులను సరిగ్గా ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా.. వారికి చెబుతామని.. అధికారులు అంటున్నారు..!