అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే.. నియోజకవర్గంలో తిరుగుండదు. నచ్చిన అధికారులను.. తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చుకుని అభివృద్ధి పనుల వేగం పెంచుకుంటారు. వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజా సైతం అదే అనుకున్నారట. తొలిసారి నగరి ఎమ్మెల్యే అయిన ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉండటంతో ఏ పనీ చేయలేకపోయానని.. అధికారులు, అప్పటి ప్రభుత్వం తనకు సహకరించలేదని చాలాసార్లు చెప్పుకొచ్చారామె.
నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యే కావడం.. వైసీపీ పవర్‌లోకి రావడంతో అనుకున్న పనులన్నీ చక చకా చేయిస్తానని ప్రజలకు మాట ఇచ్చారు రోజా. పనుల్లో స్పీడ్ పెంచేందుకు తనకు అనుకూలురైన అధికారులను రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ తదితర శాఖల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ విషయంలో రోజా ఒకటి తలిస్తే.. అధికారులు మరొకటి చేస్తున్నారట. ఎమ్మెల్యే సిఫారసులతో నగరిలో పోస్టింగ్‌లు దక్కించుకున్న వారు.. రోజాకే షాక్ ఇచ్చేలా పనిచేస్తున్నారట. ఎమ్మెల్యే చెప్పే మాటలను కొందరు ఎడమ చెవితో విని కుడి చెవితో బయటకు వదిలేస్తుంటే.. ఇంకొందరైతే తమ కార్యాలయాల్లో అవినీతి దుకాణాన్నే తెరిచేశారట.