వరంగల్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామునే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి పంపించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయి రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వారంతా ఏపీలోని ఒంగోలు నుంచి వరంగల్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి పొగ మంచే కారణంగా భావిస్తున్నారు. శీతాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజాము ప్రయాణాలు మానుకోవాలని.. తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకూడదని చెప్పారు. ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్తే వాహనాలు తక్కువ స్పీడ్తో నడపాలని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.