తిరుమల లడ్డూలో చాలా రకాలుంటాయట మీకు తెలుసా..?

-

ఎవరైనా తిరుమలకు వెళ్తున్నామని చెబితే మన నోటి నుంచి వచ్చే మొదటి మాట ప్రసాదం తీసుకురమ్మని. తిరుమల లడ్డూ మన దేశంలోనే చాలా ఫేమస్. కొంతమంది అయితే ఏకంగా లడ్డూ కోసమే తరచూ తిరుమల వెళ్తుంటారు. దేశీయ నెయ్యితో నోటిలో వేసుకోగానే కరిగేలా ఉండే తిరుమల లడ్డూలో చాలా రకాలున్నాయట. ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన లడ్డూని శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారట. ఇంతకీ తిరుమలేశుడి లడ్డూలో రకాలేంటో తెలుసుకుందామా..?

 

ఏడు కొండలపైన వెలిసిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడి లడ్డూలంటే కేవలం తెలుగు ప్రజలకే కాదు విదేశీ భక్తులకు కూడా మక్కువ ఎక్కువే. ఇక్కడి లడ్డూకి ఉండే రుచి, వాసనే వేరు. అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. అంటే తిరుమల లడ్డూ తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు.

తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజూ ఇంచుమించు మూడు లక్షల లడ్డూలు తయారు చేస్తారు. గతంలో కట్టెలపొయ్యి మీద తయారు చేసేవారు. నేడు ఆవిరి పొయ్యిలను (సుమారుగా 48 పొయ్యిలు) వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు లడ్డూ తయారీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు .

ఆస్థాన లడ్డు: వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం అమోఘం. మాటల్లో చెప్పలేం. అంత అద్భుతంగా ఉంటుంది.

 

కళ్యాణోత్సవ లడ్డు: కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతరసేవల్లో పాల్గొన్న భక్తులు. ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల “వగపడి”లో లభిస్తాయి. ఇప్పుడు కౌంటర్ లో కల్యాణోత్సవ లడ్డులు అమ్ముతున్నారు దీని ధర ఒకటి రూ. 200/-

సాధారణ లడ్డు: వీటిని ప్రోక్తం లడ్డూ అని కూడా అంటారు.వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను, లెక్కగా, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జితసేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు గ్రా. 175. ఈ లడ్డూ అందరికీ తెలిందే.

Read more RELATED
Recommended to you

Latest news