కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీశాఖ తీరంలో ఉన్న గ్రామాల ప్రజలు పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. తాజాగా కొమురంభీం జిల్లాలోని బాబాసాగర్ గ్రామ శివారులో పులి సంచరించినట్లు తెలుస్తోంది. బాబాసాగర్ గ్రామ శివారులో పులి అడుగు జాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న కాగజ్‌నగర్ మండలం వేంపల్లి – అనుకోడ గ్రామ శివారులో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగజ్ నగర్, ఈజ్ గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకున్నట్లు పాద ముద్రలు ద్వారా కనిపెట్టారు. కెమెరాల ద్వారా అటవీశాఖ అధికారులు పులి కదలికలను గమనిస్తున్నారు. పులి కోసం 12 బృందాలచే గాలింపు చర్యలు చేపట్టారు. పులి కదలికలను పర్యవేక్షిస్తున్న జిల్లా అటవీశాఖ అధికారి దినేష్ కుమార్… పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.