కరోనా లాక్డౌన్ కారణంగా జనాలు ఇండ్లలోనే ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, గేమ్స్ యాప్‌లకు ఆదరణ బాగా పెరిగింది. అందులో భాగంగానే ఆయా కేటగిరిలకు చెందిన యాప్‌లను జనాలు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక టిక్‌టాక్‌ను కూడా జనాలు బాగానే వాడుతున్నారు. దీంతో ఆ యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డౌన్లోడ్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో 150 కోట్ల నుంచి 200 కోట్లకు వచ్చేందుకు టిక్‌టాక్‌కు కేవలం 5 నెలలు మాత్రమే పట్టడం విశేషం.
కాగా ఈ ఏడాది మార్చి వరకు ప్రపంచ వ్యాప్తంగా 315 మిలియన్ల సంఖ్యలో టిక్‌టాక్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారని సెన్సార్ టవర్ స్టోర్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఓ నివేదికను వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో కలిపి ఈ సంఖ్య నమోదైంది. ఇక ఇవి కాకుండా పలు ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లు థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసుకున్నా.. వాటిని ఆ సంఖ్యలో కలపలేదు. అవి కూడా కలుపుకుంటే.. ఆ డౌన్లోడ్ల సంఖ్య ఇంకా ఎక్కువే అవుతుంది.
ఇక టిక్‌టాక్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో దాన్ని 611 మిలియన్ల సంఖ్యలో డౌన్లోడ్ చేసుకోగా.. భారత్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత 196.6 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో చైనా 2వ స్థానంలో నిలవగా, 165 మిలియన్ల డౌన్లోడ్లతో అమెరికా 3వ స్థానంలో నిలిచింది. ఇక టిక్‌టాక్‌కు చైనా నుంచి 331 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా.. అమెరికా నుంచి 86.5 మిలియన్లు, గ్రేట్ బ్రిటన్ నుంచి 9 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.