తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. భక్తుల సెంటిమెంట్స్ దెబ్బతీశారనే కారణంతో తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం రెండో రోజూ సిట్ బృందం విచారణ జరుపుతోంది. ఆదివారం మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ జరపనుంది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకటరావుల నేతృత్వంలో 3 బృందాలుగా దర్యాప్తు చేస్తున్నాయి.
టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు అంశాలను పరిగణనలోకి విచారణ చేయనున్నారు. టీటీడీ బోర్డు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాల లోతుగా విచారించనున్నారు.తొలుత టీటీడీ ఈఓ శ్యామలరావును విచారించనున్నట్లు సమాచారం.కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధను తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ బృందం విచారించనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించనున్నారు.చివరి బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరాకు టీటీడీ, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది.