ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ప్రధాన పార్టీలన్నీ బైపోల్ వ్యూహాలకు పదును పెట్టే పనిలోపడ్డాయి. ఇక ఉప ఎన్నికపై ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామా వచ్చిన క్షణాల్లోనే.. ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్.
ఆగస్టు 5న విస్తృతస్థాయి సమావేశాన్ని కూడా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ దీన్ని ఏమాత్రం సింపుల్ గా తీసుకునే పరిస్థితి మాత్రం లేదనే అంచనాకు వచ్చింది. ఉప ఎన్నికలో మాత్రం గట్టి సవాళ్లు ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అసలే కాంగ్రెస్ తమ కంచుకోట అని చెప్పుకునే ఉమ్మడి నల్గొండ.. అందులోనూ సిట్టింగ్ స్థానం కావడంతో ఏమాత్రం ఫలితం తారిమారు అయిన అనేక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందనే టెన్షన్ లో ఉందిి.
ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ కి రానున్నారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్. నేడు ఉదయం 11 గంటలకు మునుగోడు ఉప ఎన్నికపై ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.