అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేడు వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగానే… 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున ఆర్ధిక సహాయం చేయనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం కింద మూడేళ్ల పాటు 45 వేల రూపాయల ఆర్థిక చేయూత అందించనుంది ఏపీ సర్కార్. ఇక ఈ పథకం ద్వారా 3,92,674 మంది మహిళలకు లబ్ది పొందనుండగా…. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కోసం 589 కోట్లు ఖర్చు పెట్టనుంది ప్రభుత్వం.